బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద 1,538 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక ఎస్బీఐ కరీర్ పోర్టల్ ద్వారా ఆగస్టు 7 నుంచి ఆగస్టు 27, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ 2026 డ్రైవ్లో అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అభ్యర్థి ఒకసారి మాత్రమే ఈ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన స్థానిక భాషలో అభ్యర్థికి తగిన ప్రవేశం, ప్రావీణ్యం తప్పనిసరి.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ మూడు ప్రధాన దశల్లో జరుగుతుంది:
ప్రిలిమినరీ పరీక్ష
మెయిన్స్ పరీక్ష
లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్ఎల్పీటీ)
ప్రిలిమినరీ పరీక్షా విధానం:
ఆన్లైన్లో జరిగే ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి ఒక గంట కాగా, మూడు విభాగాలకు సమయాన్ని సమానంగా కేటాయించారు.
పరీక్ష సమయం: 1 గంట (ప్రతి విభాగానికి 20 నిమిషాలు)
నెగెటివ్ మార్కింగ్: తప్పుగా రాసిన ప్రతి సమాధానానికి కేటాయించిన మార్కులలో 1/4వ వంతు (0.25 మార్కులు) కోత విధిస్తారు.
కటాఫ్ నిబంధన: సెక్షన్ల వారీగా లేదా మొత్తం ప్రిలిమినరీ పరీక్షకు ఎస్బీఐ ఎలాంటి కనిష్ట అర్హత మార్కులను నిర్దేశించలేదు. సెక్షన్ల వారీ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
మెయిన్స్ పరీక్షా విధానం
ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2026లో భాగంగా ప్రిలిమ్స్ దాటిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో ఎస్బీఐ నిర్దేశించిన మొత్తం అగ్రిగేట్ కనిష్ట మార్కులను అభ్యర్థులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఇందులో కూడా సెక్షన్ల వారీగా ప్రత్యేకంగా ఎలాంటి కటాఫ్ మార్కులు ఉండవు. ఈ మెయిన్స్ పరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. 2 గంటల 40 నిమిషాల్లో మొత్తం 190 ప్రశ్నలు ఉంటాయి. ఇవి 200 మార్కులకు ఉంటాయి.
స్థానిక భాషా పరీక్ష:
ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ కోసం తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల్లో 10వ తరగతి లేదా 12వ తరగతిలో సంబంధిత స్థానిక భాషను ఒక పాఠ్యాంశంగా చదవని వారికి స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థికి స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకునే సామర్థ్యాలు ఉన్నాయో లేదో ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ పరీక్షల ద్వారా పరిశీలిస్తారు.
వయోపరిమితి, అర్హతలు:
ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి. 28 ఏళ్లకు మించకూడదు. అభ్యర్థులు ఏప్రిల్ 2, 1998 – ఏప్రిల్ 1, 2006 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వ, ఎస్బీఐ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు:
అభ్యర్థులు కేవలం ఎస్బీఐ అధికారిక కెరీర్స్ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
చివరితేదీ: ఆగస్టు 27, 2026
వెబ్ సైట్: https://sbi.bank.in/web/careers















