నీట్ యూజీ 2026 అర్హత సాధించిన విద్యార్థులకు త్వరలో కౌన్సిలింగ్ నిర్వహించి ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఇవ్వనున్నారు. దేశ వ్యాప్తంగా 15 శాతం ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ని విడుదల చేయనున్నారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే తెలంగాణలోని 85 శాతం రాష్ట్ర కోటా సీట్ల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు, కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు కలిపి తెలంగాణలో 10 వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ ఉస్మానియా, గాంధీ, బీబీనగర్ ఎయిమ్స్, కాకతీయ వంటి టాప్ కాలేజీల్లో సీట్ల కోసం జాతీయ స్థాయిలో తీవ్ర పోటీ నెలకొంది. కౌన్సెలింగ్ ప్రారంభమైన తర్వాత ఆన్ లైన్ అప్లికేషన్లు, సర్టిఫికెట్ల పరిశీలన, మెరిట్ జాబితా, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వేగంగా జరుగుతోంది.















